భక్తికి ముక్తి మార్గము
*జపం.....*
జకారో జన్మ విచ్చేద:
పకారో పాపనాశక:
జన్మపాప వినాశిత్వాత్
జప ఇత్యభిదీయతే
జపం లోని..
జా = జన్మవిఛ్చేదనం చేసేది.
పా = పాపాన్ని నశింపచేసేదని.. అర్థం.
యోగానికి జపం ఒక ముఖ్యాంశము. అందుచేతనే భగవద్గీతలో శ్రీ క్రిష్ణపరమాత్ముడు అర్జునితో..
"యజ్ఞానాం జప యజ్ఞోస్మీ" అని చెప్పడం జరిగింది. అంటె, యజ్ఞములు లన్నింటిలో నేను జపయజ్ఞంనాన్ని.. అని చెప్పాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలను గానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమత మవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా జపం మూడు విధాలుగా ఉంటుంది...
1) వాచింకం...
మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.
2) ఉపాంశువు...
తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.
3) మానసికం...
మనస్సులోనే మంత్రాన్ని జపించడం..
వాచిక జపం కంటె ఉపాంశు జపం వంద రెట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం వెయ్యిరెట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే... జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడ చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందు గానీ, తరువాత గానీ ఇష్టదేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదనేది శాస్త్రం. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.
జపమాలలు మూడు రకాలు...
1) కరమాల...
అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలము వరకు గల పది కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లువుతుంది.
2) అక్షమాల...
‘ఆ నుంచి క్షా' వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ' అనంత ఫలితాన్ని కలిగిస్తుండగా.. ’క్షా' కల్మషాలను తోలిగిస్తుంది.
3) మణి మాలలు...
రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు, తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణి మాలలని అంటారు.
రజితమాలజపం దశగుణాన్ని,
శంఖమాలజపం శతగుణాన్ని,
పగడాలమాల జపం సహస్రగుణాన్ని,
స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని,
ముత్యపు మాలజపం లక్ష గుణాన్ని,
తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని,
బంగారుమాల జపం కోటిగుణాన్ని,
తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని,
రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి...
పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపుమాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసిమాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.
అన్ని యజ్ఞాలకన్నా జపయజ్ఞం గొప్పదని మనుస్మృతి చెబుతోంది. తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించ దలచుకున్నారో, ఆ మంత్రం తోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.
త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా |
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే ||
అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠవ్రేళ్ళపై ఉంచి, చేతి బోటనివేలితో, మధ్యవేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి.
కృష్ణాజినం మీద జ్ఞాణం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠగ్వేదం.. సామవేదాలు.. లేడి రూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మరల దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠగ్వేదం, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.
దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.
గృహస్థులందు దర్భాసనం వేసుకొని గాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక, 54 లేక, 27 పూసలు ఉంటుంటాయి. దీని వెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జపసంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. చివరగా, కర్మలు, యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తపస్సులు ఎన్ని చేసినప్పటికి జపానికి సరికావన్నది పెద్దల వాక్కు. అందుకనే జపాన్ని ఒక యోగం అన్న మన పెద్దలు, దానికి పెద్దపీటను వేసారు.
జపము.. విశిష్టత...
ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది.
నదిలో చేసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది.
గోశాలలో జపం వందరెట్లు,
యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది.
పుణ్యతీర్ధాల లోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము.
శివ సాన్నిద్యంలో జపం చేస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది...
🙏
No comments:
Post a Comment